Pages

Wednesday, August 23, 2017

వినాయకోత్పత్తి (గణేశోపాఖ్యానము) శ్రీ శివ మహాపురాణాంతర్గతం

గణేశావిర్భావమును గూర్చి కొన్ని పిట్టకథలు, సినిమా కథలు విరివిగా ప్రచారముననుండి, శివునికి తన పుత్రుడే తెలియదా, అలా ఎలా బాలుని సంహరిస్తాడు వంటి అనేక అపభ్రంశ సందేహాలు నాస్తిక భావనలు వ్యాప్తిజెందుట, అసంబద్ధ ప్రశ్నలువేయుట ఎల్లరకూ విదితమే. శివపురాణమందలి గణేశోపాఖ్యానము స్పష్టముగా ఈ విషయములన్నింటినీ వివరించును. చాలామంది వానిని చదవక, సినిమా కథలు, అన్యులు వేయు చవకబారు ప్రశ్నల నిజమని తలచి మన ధర్మమును, మన దేవుళ్ళను మనవారే కిఞ్చపరచుచుందురు. రాబోవు వినాయక చతుర్థి సందర్భమున శివపురాణాంతర్గత వినాయకోత్పత్తి మూలమునకు తెలుగున అనువదించి మన అందరికోసం పంచడమైనది. అందరూ దీనిని చదివి "లోకాచార పరుడు, లోకాచారమును గౌరవించి తగురీతిన ప్రవర్తించువాడు ఐన పరమేశ్వరుని లీలలను, జగజ్జనని లీలలని వినాయకోత్పత్తిని తెలుసుకోగలరు" -శంకరకింకర

శ్రీ శివ మహాపురాణాంతర్గత వినాయకోత్పత్తి (గణేశోపాఖ్యానము)
శ్రీ గురుభ్యోనమః

 
సూత మహర్షి, తక్కిన మునులకు శివపురాణమును ప్రవచించుచూ, అనేక విషయములను ప్రస్తావించుచుండెను. చతుర్ముఖ బ్రహ్మగారు, నారదునికి కుమార జననము అవతార ప్రశస్తి చెప్పిన పిమ్మట, నారదుడు అత్యంత ప్రేమతో బ్రహ్మగారిని గణేశ జననమును గూర్చిన విషయములు వివరించమని కోరెను. అంత బ్రహ్మగారు నారదుని ప్రేమారగాంచి దివ్యము, మంగళములలోకెల్ల అతి మంగళమగు గణేశ జన్మ వృత్తాంతమును మనసున ఒకసారి శివుని స్మరించి చెప్పసాగెను. " గణేశుని వృత్తాంతము ఒక సారి నేను ఇంతకు ముందు చెప్పియుంటిని, గణేశుడు పుట్టుట, శని గణేశుని చూడగా ఆతని శిరస్సు భిన్నమగుట, అప్పుడతనికి ఏనుగుతలను అతికించుట అను గాథను చెప్పియుంటిని. ఆ గాథ వేరొక కల్పమునకు చెందినది. ప్రస్తుతము శ్వేత వరాహ కల్పమునకు సంబంధించిన గణేశును జననమును గూర్చి చెప్పెదను సావధానముగా వినుము. ఈ గాథలో పరమ దయాళువైన శివుడు గణేశుని శిరము నరుకును. ఓ నారదా ఈ విషయములో నీవు ఏ మాత్రము సందేహము వైక్లవ్యము పొందకుము. అనన్య సామాన్య లీలలు చేయువాడు ఆ శంభుడు, సర్వేశ్వరుడూ. ఆయనే నిర్గుణుడూ, సగుణుడూ. ఓ నారదా! ఆయన లీలామాత్ర సంకల్పముచేతనే సకల జగత్తు సృజింపబడి, పాలింపబడి, లయం కావించబడుతున్నది. ప్రస్తుత కల్పమునకు సంబంధించి శివుడు పార్వతీదేవిని వివాహమాడి కైలాసమునకేగిన కొంత కాలమునకు గణేశ జననము జరిగినది. గణేశ జనన గాథను శ్రద్ధగా వినుము.


ఒకానొక సమయములో జయ, విజయ అను చెలికత్తెలు పార్వతీ దేవితో కలిసి చర్చించుచుండిరి. "రుద్రగణాలన్నీ శివుని ఆజ్ఞనే పాలించుచున్నవి. వారిలో నంది, భృంగి మనవారే ఐనా మిగిలిన ప్రమథ గణాలన్నీ లెక్కలేనన్ని ఉన్నవి. మన మాట విని మన ఆజ్ఞ పాలించే ఒక్కడైనా లేడు. అందరూ మన వారే ఐనా వారి యందు బేధ బుద్ధి కలుగుచున్నది. కావున ఓ పుణ్యాత్మురాలా! నీవు మన మాట వినే ఒకనిని ద్వారము వద్ద ఏర్పాటు చేయవలెను" అని పల్కిరి. ఆది విన్న పార్వతీదేవి, అదీ నిజమే అని తలచి వారి కోరిక మేరకు చేయుటకు నిశ్చయించుకొన్నది. ఒకనాడు తల్లి స్నానమాచరించుచుండగా ద్వార పాలకుడగు నందిని గద్దించి సదాశివుడు ఇంటిలోపలికి వచ్చెను. సమయము కాని సమయములో వచ్చిన శంకరుని చూసి తల్లి పార్వతి సిగ్గుపడి లేచి నిలబడిది. ఆఉత్కంఠ సమయములో తన చెలికత్తెలు చెప్పిన మాటలు గుర్తుకువచ్చినవి.


కొద్ది కాలం తరవాత తల్లి పార్వతి సమర్థుడైన ఒక వ్యక్తి నాకు సేవకుడుగా ఉంటే చాలాబాగుండు, ఆవ్యక్తి నా ఆజ్ఞను కించిత్ కూడా జవదాటనివాడై ఉండగలడు అని తలచెను. తన శరీరమునుండి రాలిన నలుగు పిండితో తాను కోరిన లక్షణములుండు విధముగా ఒక పురుషాకారమును నిర్మించెను. ఏ దోషములులేని అవయవములతో సుందరమైన అవయవములతో, సమర్థుడు, సర్వ శుభలక్షణములతో మహా బల పరాక్రమములు కలదిగా ఆ పురుషాకారమును నిర్మించి ప్రాణములు పోసెను. ఆ తల్లి ఆ పురుషునకు అనేక వస్త్రములు, అలంకారములు ఇచ్చి సర్వోత్తమునిగ అనేక ఆశీర్వచనములు ఇచ్చెను. "నీవు నా పుత్రుడవు, నీవు తప్ప నా సేవకొరకు నావాడనువాడు మరొకడు ఇక్కడ లేడు." అని పార్వతీదేవి పలుకగా, ఆ పురుషుడు జగజ్జననికి వినయముగా నమస్కరించి అమ్మా ఇప్పుడు నేను చేయదగిన పనియేమి. నీ మాటను నేను నెరవేర్చెదను అని అడుగగా, పార్వతీ దేవి " ఓ పుత్రా! ఇపుడు నీవు నాద్వారమును రక్షించుము. నీవు నాపుత్రుడవు గనుక నావాడవు నీవు తప్ప మరొకడు నావాడు లేడు. పుత్రా! ఎవ్వరైనా ఎప్పుడైనా నా ఆజ్ఞ లేనిదే నా గృహములోనికి ప్రవేశించరాదు." అని పలికి ధృడమగు దండమును ఒకదానిని ఆయుధముగా ఆ బాలునికిచ్చెను. ఆ ద్వారము వద్ద తన పుత్రుడు కాపలా ఉండగా, పార్వతీ మాత తన సఖులతో కూడి స్నానము చేయుచుండెను.


"నానాలీలా విశారదుడగు శివుడు" అకస్మాత్తుగా ఆ ద్వారము వద్దకు వచ్చెను. ఆయనే శివుడని తెలియక ద్వారము వద్ద కాపలా ఉన్న దేవీపుత్రుడు ఇట్లు పల్కెను " ఓ దేవా! తల్లి ఆజ్ఞ లేనిదే నీవిపుడు లోనికి పోరాదు. తల్లి స్నానమునకు వెళ్ళినది. నీవు అటు వెళ్ళరాదు " అని శివుని నిలువరించడానికి చేతిలోకి కర్రతీసుకొనెను. అది చూసి శివుడు విస్మయం తో " ఎవరు నీవు? నీవు ఎవరికి అడ్డుపడుతున్నావో తెలుసా ఓ మూర్ఖా! నేను శివుడను" అని అన్నా వినక ఆ దేవీ పుత్రుడు అనేక విన్యాసములు చూపుతూ మహేశ్వరుని ఆ కర్రతో కొట్టెను. అంత కోపించిన మహేశ్వరుడు తిరిగి ఆ ద్వారపాలకుని చూచి "ఓ మూఢా! నేను శివుడను, పార్వతీపతినని తెలుసుకో. నా ఇంటికి వెళ్ళకుండ నన్నే అడ్డుకుంటావా" అని పలికి లోపలికి ప్రవేశిస్తున్న శివుని పై మరోమారు ఆ దేవీపుత్రుడు కర్రతో ప్రహారము చేసెను. అంత కోపించిన శివుడు రుద్రగణములతో "వీడెవ్వడు? ఇక్కడేమి చేస్తున్నాడు, చూడండి" అని "లోకాచారములను పాటిస్తూ అనేక అద్భుత లీలలను ప్రదర్శించు ప్రభువు" ఇంటిబయట నిలబడెను. (13 వ అధ్యాయం) -శంకరకింకర


రుద్రగణములు ఆ పార్వతీ నందనుని వద్దకు వచ్చి విచారించి, వచ్చినవాడు పార్వతీ నాధుడైన శివుడనీ పక్కకు తొలగమనీ చెప్పిరి. ఆ దేవీ పుత్రుని కూడా రుద్రగణములలో ఒకనిగా చూస్తున్నామనీ, అనవసరంగా మృత్యువుని కొనితెచ్చుకోవద్దనీ హితవు చెప్పినంత, ఆ పార్వతీ నందనుడు కొంచెమైనా బెదరక మీరు శివుని సేవకులు, నేను పార్వతీ మాత సేవకుని అని గద్దించి బెదిరించెను. ఈ విషయమంతా గణములు శివునకు విన్నవించగా శివుడు కోపించి ఎట్టిపరిస్థితులలోనైనా ఆ బాలకుని తొలగించమని ఆజ్ఞాపించెను. ద్వారమువద్ద కలకలమును విని పార్వతీ దేవి చెలికత్తెలు ఆ పార్వతీ నందనుడు శివగణములతో జరుపు వాదమును విని సంతోషిచి పార్వతీ దేవితో ఇట్లు పలికిరి " ఓ మాహేశ్వరీ! అభిమానవతీ! శివగణములు ద్వారమునందు నీ పుత్రుని చేత నిలువరింపబడినవి. ఆతనిని వాదమున గెలవక వారు లోనికి రాలేరు. తల్లీ నీవు కూడ నీ అభిమానమును విడవకు. శివగణములను ఎదిరించి మన మాట వినే సేవకుడు ఉన్నాడని వారికి తెలిసి వారి అహంకారము తగ్గి మనకు అనుకూలురు కాగలరు" అప్పుడు పతివ్రత, అభిమానవతి అగు పార్వతీ దేవి శివుని (మాయకు) ఇచ్ఛకు వశురాలై తన మనస్సులో ఇలా అనుక్కున్నది. "ఆయన ఒక్క క్షణకాలము ద్వారమున నిలచియుండిన వాడు కాదు, పైగా లోపలికి వెళ్లవలెనని హఠము చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన యందు ఉన్న వినయమునకు భంగం కలగకుండా ఎలా వ్యవహరించాలి? జరిగేది జరగక మానదు" అని తన సఖిని పిలిచి తన పుత్రుని వద్దకు పంపెను. ఆ సఖి దేవీపుత్రుని తో ఇట్లు పలికెను " ఓ కుమారా! నీవు చేసిన పని బాగున్నది. వారిని బలవంతముగా ప్రవేశింపకుండ చేయుము. నీఎదుట ఈ గణములు నిలువలేవు. నీ వంటి పరాక్రమ వంతుని ఆ గణములు జయించలేవు. వారి కర్తవ్యము వారు చేసినా చేయకపోయినా, నీకర్తవ్యమును నీవు చేయుము. నీవు గెలిచినా వైరము మాత్రము పొందవద్దు జ్ఞప్తి ఉంచుకో". దేవీపుత్రుడు ఆమాటలను విని సంతోషించి రెట్టించిన ఉత్సాహముతో నిర్భయముగా ఆ గణములనుద్దేశించి ఇలా పలికెను. " నేను పార్వతీ పుత్రుడను, మీరు గణములు. మనమిద్దరమూ సమానమే. కాబట్టి ఎవరి కర్తవ్యమును వారు నిర్వర్తించెదము. మీరు ద్వారపాలకులు, ఇప్పుడు నేనూ ద్వారపాలకుడను. నేనిక్కడ పార్వతీ మాత అనుజ్ఞమేరకు నిలబడియున్నాను. మీ కర్తవ్యమేమో తెలిసికొని నిర్వర్తించండి శివుని ఆజ్ఞను పాలించండి. ఇపుడూ నేను పార్వతీ మాత ఆజ్ఞను పాటించుచున్నాను. ఈ నా నిర్ణయము యథోచితమైనదే." అంత గణములు సిగ్గుతో శివుని వద్దకు వెళ్ళి నమస్కరించి స్తుతించి అద్భుతమగు పార్వతీ నందనుని వద్ద జరిగిన వృత్తాంతముని విన్నవించిరి. లోకాచారమును అనుసరించి లీలలు చేయు మహానుభావుడైన శివుడు తన గణములతో " ఓ వీరులారా! ఇప్పుడు యుద్ధము సముచితము కాదు. మీరు నాగణములు , నాకు సంబంధించిన వారు. ఆతడు గౌరికి సంబంధించినవాడు. కానీ, నేనీ సమయములో వెనుకకు తగ్గినచో శివుడు సర్వదా గౌరికి దాసుడని భార్యావిధేయుడనీ అపవాదు కలుగగలదు. ఎదుటివాని పరాక్రమము శక్తిని కొలచి ప్రతీకారము చేయవెలె. ఆబాలుడు ఏకాకి ఏమి పరాక్రమము చూపగలడు? మీరు యుద్దములో బహు పరాక్రమము కలిగినవారని పేరొందినారు అట్టివారు ఎలా యుద్ధములో తేలిక అవుతారు? స్త్రీ మొండి పట్టు పట్టరాదు. అందునా భర్త యెదుట అసలు పట్టరాదు. గిరిజాదేవి తన పట్టు సడలించనిచో దాని ఫలము నిశ్చయముగ అనుభవించగలదు. కావున మీరందరూ శ్రద్దగా నా మాట విని నిశ్చయంగా యుద్ధము చేయండి. ఏది జరుగ వలెనో అది జరుగకమానదు" "లోక వ్యవహారమును మన్నించి మహాలీలా విశారదుడైన శివుడు అనెను". (14 వ అధ్యాయము) -శంకరకింకర


రుద్ర గణములు పార్వతీ దేవి మందిరము వద్దకు యుద్ధ సన్నద్ధులై వెళ్ళగా వారిని చూసిన పార్వతీ నందనుడు " గణములకు స్వాగతము. బాలుడను, ఒంటరిని ఐన నేను పార్వతీ మాత ఆజ్ఞను పాటించెదను. మీరు శివాజ్ఞను పాటించండి. పార్వతీ దేవి ఇక తన కుమారుని బల పరాక్రమముని చూడగలదు. అలానే శివుడు కూడా తన గణముల బల పరాక్రమాలెట్టివో చూడగలడు. మీరెన్నో గొప్ప యుద్ధములు చేసినవారు.యుద్ధములో ప్రావీణ్యమున్నవారు. నాకు అటువంటి అనుభవములేదు. నేను ఇప్పుడు మీతో యుద్ధము చేయబోతున్నాను. ఈ విషయమై నాకు కలిగే వినాశనమేమీలేదు. పార్వతీ పరమేశ్వరులు సిగ్గుపడితే అది మన ఇద్దరికీ సిగ్గుపడవలసిన విషయమే కాబట్టి మీరు శివుని ముఖం చూసి గౌరవం ఇనుమడించేలా యుద్ధం చేయండి నేను నాతల్లి పార్వతి ముఖం చూసి గౌరవం ఇనుమడించేలా యుద్ధం చేస్తాను. దీనిని ఆపగల సమర్థుడు లోకంలోనే లేడు." అని పలికెను


నంది, భృంగి ఇత్యాది ముఖ్యులందరూ పార్వతీ నందనుని చే యుద్ధములో ఎదురిడి ఓడిరి. ఒక్క గణము కాని, గణాధ్యక్షుడు కానీ యుద్ధమున నిలువలేకుండిరు. పార్వతీనందనుని దెబ్బలకు తాళలేక పారిపోవుచుండిరి. ఎముకలు విరిగినవి, కాళ్లూ తెగినవి, చేతులు తెగినవి. కల్పాంతంలో భయపెట్టే ప్రళయాన్ని ఆయుద్ధము తలపింప చేసినది. అదే సమయమున నారదుడు ఈ విలయానికి కారణమేమో చెప్పి బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలతో కూడి శివుని వద్దకు వచ్చి నమస్కరించి ఈ అకాల ప్రళయానికి కారణమడిగిరి. శివుడు వారికి ద్వారమునందున్న బాలకుని వృత్తాంతమంతా చెప్పగా బ్రహ్మాదులు ఆ బాలకునికి నచ్చచెప్పబోయి ఆ బాలుని పరాక్రమమునకు నిలువలేక వెనుతిరిగిరి.


నారదాది మునులు శివునికి నమస్కరించి " ఓ పరమ శివా! ఈ బాలుడెవ్వడు? పూర్వము ఎన్నో యుద్ధముల గురించి విన్నాము కానీ ఇటువంటి యుద్ధాన్ని ఎప్పుడూ చూడలేదు, వినలేదు. ఓ దేవా సావకాశముగా ఆలోచించి నిర్ణయించుము . లేనిచో జయము కలుగదు. హే స్వామీ! జగద్రక్షకుడవు నీవే. ఈ ఆపదనుండి గట్టెక్కించుము." అని పలుకగా రుద్రుడైన శివుడు తన గణములతో కూడి యుద్ధస్థానముకు బయలుదేరెను. దేవ సైన్యం విష్ణువుతో కూడి గొప్ప ఉత్సవము వలె శివుని అనుసరించినది. అప్పుడు తిరిగి నారదుడు ఇట్లు పలికెను" ఓ దేవ దేవా! మహాదేవా! విభూ! నామాటలను ఆలకించండి. సర్వవ్యాపివగు నీవు అనేక లీలలను హేలగా చేయగల ప్రభువు. నీవు ఇంత గొప్ప లీలను చూపి సకల గణముల గర్వమునూ అణిచావు. ఓ శంకరా! ఈ పార్వతీ నందనునకు మహాబలమిచ్చి దేవతల గణముల గర్వాన్ని అణిచావు. ఓ నాథా! శుభంకరా! సర్వస్వతంత్రా నీవు అందరి గర్వమునూ ఆ పిల్లవాని చేతిలో అణచివేసి నీ బలమును లోకమునకు చాటి చెప్పితివి. ఓ భక్త ప్రియా! ఇంకా నీ ఈ లీలను కొనసాగించవద్దు. ఈ ఆటను ఇక్కడితో ఆపుము" అని పల్కెను"
అంత ఆ మహేశ్వరుడు విష్ణువుతో సంప్రదించి తన గణములు దేవ సైన్యముతో కలిసి ఆ బాలుని సంహరింప యుద్ధమునకు తరలెను. అక్కడ జరిగిన యుద్ధములో పార్వతీ నందనుని చేతి కర్ర తో దెబ్బలు తిననివారులేరు. పార్వతీ దేవి శక్తులు ఆ బాలుని వచ్చి చేరినవి. ఆ బాలునికి దేవ సైన్యానికి, విష్ణువుకు గొప్ప యుద్ధము జరిగినది. విష్ణువు బాలుని చేతిలో పరాభవము పొందుట చూచిన శివుడు కృద్ధుడై త్రిశూలముతో, పినాకముతో, శూలముతో రక రకముల ఆయుధములతో ఆ బాలుని సంహరించ ప్రయత్నింప ఆబాలుడు తన తల్లి శక్తితో అన్నింటినీ పరిహరించెను. లోకాచారముననుసరించి శివుడు మిక్కిలి ఆశ్చర్య చకితుడైయ్యెను. అటుతరవాత శివ గణములతో, విష్ణువుతో, దైవ సైన్యముతో శివునితో, శివ శక్తిచే వృద్ధిపొందిన శక్తి తనయుడు యుద్ధముచేసి అందరినీ పీడించెను. లీలా రతుడైన శివుడు సమయము చూసి ఆబాలుని కుత్తుకను శూలముచే ఉత్తరించి ఆబాలుని సంహరించెను.(15, 16 వ అధ్యాయము) -శంకరకింకర

అంత గణములు, దైవ సైన్యములు తప్పెట్లు తాళములు మ్రోగిస్తూ నృత్యము చేయనారంభించిరి. అంత నారదుడు ఆ విషయమును తల్లి పార్వతికి తెలియజేసి తన అభిమానమును కాదని శాంతముతో ఉండమని చెప్పెను. అది విన్న పార్వతీ దేవి క్రోధావేశయై, దుఃఖముతో నాకుమారుని సంహరించినారాయని బాధతో లోకమునకు ప్రళయమును కలిగించెదనని తలచి కొన్ని లక్షల సంఖ్యలో శక్తులను సృజించెను. ఆ శక్తులతో దేవి ఇట్లు పలికెను " ఓ శక్తులారా! నా ఆదేశముచే మీరిపుడు ఇక్కడ ప్రళయమును కావించండి. దేవతలను, గణములను, యక్షులను, రాక్షసులను వీరు వారని లేక అందరినీ భక్షించండి" అప్పటివరకూ పార్వతీ నందనునితో యుద్ధము ప్రళయమును తలపించి అతని మృత్యువుచే శాంతము పొందగా తిరిగి ఈ కొత్త ప్రళయమేమని దేవతలు, గణములు, సర్వ భూతములు బెంబేలు పడినవి.

అంత అందరూ కలిసి ఈ ప్రళయము ఎలా శమించునని నారదుని ప్రశ్నించగా, దానికి ఒకే మార్గము పార్వతీ దేవి శాంతించుట అని తెల్పెను. అంత మునులు దేవతలు అందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడి పార్వతీ మాత వద్దకు చేరి నమస్కరించి శాంతింపమని కోరిరి. "తల్లీ, నీ భర్త! లీలా విలాసములనొనరించువాడు ఇక్కడే ఉన్నాడు. బ్రహ్మ, విష్ణువు మేమందరమూ నిన్ని శరణుజొచ్చాము మేమందరము కూడా నీకు బిడ్డలమే కదా" అని పల్కి శాంతించుటకుపాయము కోరిరి. అంత ఆ తల్లి నాకుమారుడు పునర్జీవితుడైన నేను శాంతించెదనని పలికినది. అతడు తిరిగి జీవించిన ఈ సంహారము ఆగును. అతడు మీ అందరికీ పూజ్యుడు కాగలడు. అతడు మీ గణములకందరకీ అధ్యక్షుడు కాగలడు. అపుడు లోకము శాంతిని పొందగలదు.
అది విని శంకరుడు ఉత్తర దిక్కునకు వెళ్ళి ముందు కనిపించిన ప్రాణి శిరస్సును తీసుకురమ్మని పంపెను. శివుని ఆజ్ఞను పాలించే దేవతలు ఆజ్ఞ తీసుకుని బయలుదేరిరి. వారికి కనిపించిన ఒక ఏనుగు శిరమును తీసుకువచ్చి శుభ్రముగా కడిగి ఆబాలకుని దేహమునకు అతికించి శివునితో " హే పరమేశ్వరా! శిరము బాలుని తలకు అతికించితిమి ఇక మీరు చేయవలసిన కార్యము చేయండి అని పలికిరి" అక్కడనే ఉన్న బ్రహ్మ విష్ణువులు శివుని జూచి" హే మహాదేవా! నీవు ప్రభువువు, నిర్గుణుడవు, పాలకుడవు. నీ తేజస్సు చేతనే మేమందరమూ జన్మించితిమి. వేద మంత్ర ప్రభావములచే నీ ఆతేజస్సు ఇక్కడకు వచ్చుగాక" అని స్మరించి. శివుని కి నమస్కరించి మంత్ర జలములను దేహముపై చల్లిరి. అపుడా బాలకుడు శివ సంకల్పముచే ఆ జలములు తగిలిన వెంటనే చైతన్యమును పొంది నిద్దుర నుండి లేచిన వాని వలె లేచి నిలబడెను. మిక్కిలి సౌభాగ్యవంతుడు, అందగాడు, ఏనుగు మోము కలవాడు, ఎర్రని రంగు కలవాడు ప్రసన్న ముఖుడు, గొప్ప కాంతితో సుందరమైన ఆకారము కల ఆ పార్వతీ తనయుని చూసి అందరూ ఆనందించిరి. ఆ పార్వతీ దేవి సహితము తన తనయుని చూసి అతని పరాక్రమము తలచి బహుసంతోషించినది. (17 వ అధ్యాయము) -శంకరకింకర

ఆ జీవించిన బాలకుని చూసి పార్వతీ పరమేశ్వరులు ఆనందము పొందిరి లోకమంతయును శాంతిని పొందినది. ఆ గజాననుని దేవతలు, మునులు గణనాయకులు అభిషేకించిరి. పార్వతీ దేవి తన కుమారుని చూసి ఆనందముతో దగ్గరకు తీసికొని ఆనందించి వివిధ వస్త్రములు ఆభరణములు ఇచ్చినది. ఆ దేవి గజాననునికి అనేక సిద్ధులనిచ్చే తన చేతితో నిమిరి ముద్దాడి ప్రీతితో ఎన్నో వరములిచ్చినది. గజాననుడు పుట్టుకతోనే ఆపదకలిగి తొలగినందున ఇక ఎల్లప్పుడూ దుఃఖరహితుడవౌదువని వరమిచ్చెను. అప్పుడు "గజాననుని చెక్కిళ్ళపై ఆ తల్లి సింధూరము అంటుకుని గజాననుడు మరింత అందముగా కన్పడగా ఆతల్లి మానవులు గజాననుని సర్వదా సింధూరముతో పూజించెదరిని పలికెను".

పుష్పములు, శుభ్రమగు గంధము (తెల్ల గంధము), నైవేద్యము, తామ్బూలము, నీరాజనము, ప్రదక్షిణ నమస్కారములు అను విధానములో ఎవరు పూజిస్తారో వారికి నిస్సంశయంగా సర్వమూ సిద్ధించును, సకల విఘ్నములు నశించును అని పలికి తన భర్తతో కూడి విఘ్నేశ్వరుని మరల అనేక వస్తువులతో అలంకరించెను. అప్పుడు ఇంద్రాది దేవతలు శివుని శాంతింపజేసి మహేశ్వరుని మహేశ్వరి పక్కన కూర్చుండబెట్టి సకల లోక శాంతి కొరకై పార్వతీదేవి ఒడిలో గజాననుని కూర్చుండబెట్టిరి. అప్పుడు శివుడు ఆ గజాననుని శిరస్సున పద్మములవంటి తన చేతులనుంచి వీడు నాకుమారుడు అని పలికెను. అప్పుడు గణేశుడు లేచి శివునకు, పార్వతికి, విష్ణువునకు, బ్రహ్మగారికి, తక్కిన పెద్దలకు ఋషులకు నమస్కరించి ఇట్లు పలికెను" నా అపరాధమును మన్నించండి. నా అహంకారము, అభిమానము కలిగి ఉండడం జీవుల లక్షణం" అంత త్రిమూర్తులు ముగ్గురూ ఒకేసారి గజాననునికి ముల్లోక పూజార్హత, ప్రథమ పూజార్హతను ఇచ్చి ఇట్లు పలికిరి " ఈతనిని పూజించకుండ ఎవరిని పూజించినా అది పూజించినట్లు కాదు. ముందు ఇతనిని పూజించిన పిదపనే ఇతరులను పూజించవలె" అని పలికిరి. పార్వతీ దేవిని ఆనందింపజేయుట కొరకు బ్రహ్మా విష్ణువులు గజాననుడే సర్వాధ్యక్షుడని తెలిపి కీర్తించిరి. సకల లీలలకు మూలమైన శివుడు సర్వకాలములందూ సుఖాన్నిచ్చే వరాలనెన్నింటినో ఇచ్చి ఇట్లు పలికెను " ఓ పార్వతీ పుత్రా! నేను సంతోషించితిని. నేను సంతోషించిన జగత్తు సంతోషించును. నీవు శక్తి పుత్రుడవు గొప్ప తేజోశాలివి. నీవు బాలుడవే ఐనా మహా పరాక్రమము ప్రదర్శించితివి. ఎల్లప్పుడూ సుఖముగా ఉండు. నేటి నుండి నీవు నా గణములన్నింటికీ అధ్యక్షత వహించి గణాధ్యక్షునిగా , గణేశునిగా పూజలు పొందుము."

లోకమునకు మంగళములు చేయు ఆ శంభుడు గణేశునికి మరల వరాలిచ్చెను " ఓ గణేశా ! నీవు భాద్రపద శుక్ల చతుర్థినాడు చంద్రోదయ శుభకాలమున జన్మించితివి. పరమ పవిత్రురాలైన గిరిజ శరీరము నుండి మొదటి ఝాము లో నీ రూపము ఆవిర్భవించెను కాబున ఈ రోజు నీ వ్రతము చేయుట ఉత్తమమైనది. కాబట్టి సర్వ కార్యములు సిద్ధించుటకు ఆ తిథినాడు ఆరంభిమ్చి శుభకరమగు వ్రతమును ఆనందముతో శ్రద్ధతో అనుష్ఠించవలెను. మరల సంవత్సరము ఈ తిథి వచ్చు వరకు ఈ వ్రతమాచరించవలెను. సంసారమందు ఎన్ని సుఖములున్నవో అన్నీ పొందగోరువాడు, నిన్ని చవితి తిథినాడు భక్తితో యథావిధిగా పూజించవలెను. మార్గశీర్ష కృష్ణ చతుర్థినాడు ఉదయమే స్నానము చేసి వ్రతమాచరిమ్చి బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను, ఉపవాసముండి దూర్వములతో పూజించవలెను. లోహమూర్తిని గానీ, పగడముల మూర్తిని గానీ, తెల్ల జిల్లేడుతో చేసిన మూర్తిని గానీ, మట్టితో చేసిన మూర్తినిగానీ పూజించవలెను. ఆమూర్తిని చక్కగా ప్రతిష్ఠించి నానావిధములగు దివ్య చందనములతో సుగంధ ద్రవ్యములతో, పుష్పములతో శ్రద్ధగా పూజించవలెను. దూర్వళూ పన్నెండు అంగుళముల పొడుగు ఉండి చివర్లు, మొలకలు లేనివిగా ఉండవలెను నూటొక్క దూర్వలతో ఆ ప్రతిమను పుజించవలెను. అలానే ఇరవైయొక్క పత్రములతో గణపతి ప్రతిమను పూజించి, ధూప దీప నైవేద్యములతో పూజించవలెను. తరవాత బాల చంద్రుని పూజించి బ్రాహ్మణులకు మధుర పదార్థములతో ఆనందముగా భోజనము ఏర్పాటు చేయవలెను. తానుకూడ లవణమును వర్జించి భుజించవలెను. తరవాత అక్కడనే ఇద్దరు స్త్రీలను ఇద్దరు బాలకులను పూజించి భోజనము ఏర్పాటు చేయవలెను. రాత్రి జాగరమొనర్చి మరల మరల తిరిగి రావలెనని ఉద్యాపన చెప్పవలెను. వ్రతము పూర్ణమగుట కోసం ఒక బాలకునికి దోసిలి నిండా పువ్వులు ఇచ్చి వాని నుండి ఆశీస్సులు గ్రహించవలెను. తరవాత మిగిలిన సత్కారాలు పూర్తిచేయవలెను. ఇలా వ్రతము చేసిన వారికి సకల కోరికలు తీరుతాయి. ఓ గణేశా! నిన్ను నిత్యము శ్రద్దతో పూజించువాని కోర్కెలన్నీ ఈడేరును. నిన్ని సింధూరము, గంధము, బియ్యము, మొగలి పువ్వులు మొదలైన వివిధ ద్రవ్యములతో ఉపచారములతో పూజించవలెను. ఎవరైతే భక్తితో నీకు అనేక ఉపచారములు సమర్పించి పూజిస్తారో వారికి సిద్ధి కలుగును. వారిని విఘ్నములు ఏనాడూ బాధించవు. అన్ని వర్ణముల వారూ, స్త్రీలూ కూడా ఈ వ్రతమును ప్రత్యేకముగ చేయవలెను. ఎవరెవరు ఏయే కోర్కెలు కలిగి ఉందురో, నిత్యమూ నిన్ను పూజించటం ద్వారా వారికి ఆయా కోర్కెలు సిద్ధించును." అని శివుడే గణేశ ఫుజావిధిని నిర్ణయించి తత్ఫలితమును తెల్పెను.

అప్పుడు సకల దేవతలు, శివ గణములు, మునులు, సకలురు ప్రీతితో మేమలాగే చేసెదము అని పలికిరి. గణేశుని యథావిధిగా పూజించిరి. అప్పుడు సర్వ గణములు గణేశునికి ప్రణమిల్లి అనేక వస్తువులతో పూజించిరి. పార్వతీ దేవి సంతోషము వర్ణింపనలవి కాదు. దేవ దుందుభులు మ్రోగినవి, అప్సరసలాడిరి, పాడిరి, సర్వులకూ దుఃఖములు తొలగినవి. సకల దేవతలూ, బ్రహ్మ విష్ణు ఇంద్రాదులు పార్వతీపరమేశ్వరుల అనుజ్ఞతో వారి వారి లోకాలకు వెళ్ళిరి. అని బ్రహ్మగారు గజాననోత్పత్తి అంతా నారదునికి తెలిపి ఇట్లు పలికెను " ఓ నారదా! మహర్షీ! పుజనీయుడా! నీవు అడిగిన ప్రశ్నకు బదులుగా, పార్వతీ పరమేశ్వరుల మరియు గజాననుని వృత్తాంతము చెప్పితిని. ఎవరైతే ఈ పరమ పవిత్ర గాథను భక్తితో వింటాడో, వానికి సమస్త మంగళములు పొందగలడు. పుత్రుడులేని వానికి పుత్రులు కలుగుదురు, భార్యను కోరు వాడు భార్యను పొందును. సంతానమును కోరువాడు సంతానమును పొందును. రోగి ఆరోగ్యవంతుడగును, దురదృష్ఠవంతుడు భాగ్యశాలి అగును, పోయినవి తిరిగి లభించును. దూరదేశములనున్న భార్య,భర్త, బంధువులు కలుసుకొనెదరు. శోకముతో ఉండేవాని శోకము తొలగిపోవును..

ఈ గణేశోపాఖ్యానము ఎవరి ఇంట్లో ఉండునో వాడు నిత్యమంగళుడనుటలో సందేహములేదు. ప్రయాణ కాలమందు, పర్వదినములందు ఎవరైతే దీనిని సావధాన చిత్తుడై వినునో వాడు గణేశుని అనుగ్రహముచే ఇష్టములన్నీ పొందును. (18 వ అధ్యాయము) -శంకరకింకర

శ్రీ శివమహాపురాణాంతర్గత రుద్రసంహితలోని కుమార ఖండంలో గణేశోపాఖ్యానమను పదమూడు (13) నుండి పద్దెనిమిది (18) అధ్యాయములు సమాప్తముTuesday, July 11, 2017

హేతువాది అతిపెద్ద మూఢవిశ్వాసం

హేతువాది, నాస్తికవాది దృష్టిలో ఆస్తికులందరూ ఆలోచన చేయనివాళ్ళు లేదా ఆలోచించే శక్తిని వదులుకున్నవాళ్లు గిరిగీసుకుని బ్రతికేవాళ్లు. ఆస్తికుడైన వ్యక్తి ఒక వ్యక్తికి పనికివచ్చే మాట మాట్లాడినా పదిమందికి పనికి వచ్చే పని చేసినా ఆ వ్యక్తి మాట ప్రభావం వలన సమాజంలో ఏ మంచి జరిగినా దాన్ని ఒప్పుకోలేడు. ఒక వ్యక్తిని రోడ్డు దాటించే సహాయం నుంచి తీసుకుని జీవితాన్ని పండించుకునేదైనా లేక సమాజానికి పనికి వచ్చే ఎంత పెద్ద మాట సహాయమైనా సరే జరిగిన ఆ మంచిని అంగీకరించలేడు. పూర్వ నిర్ధారిత సిద్ధాంతం భావజాలం వల్ల ధార్మిక ఆలోచనలు గానీ లేదా మత సంబంధమైన సాహిత్యం కానీ ఎంత మంచిదైనా సహేతుకం కానివనీ, అవి పనికిరానివనే అపోహలో బ్రతికేస్తుంటాడు. ఆ భ్రమ కూడా ఓ మతమే అనీ తానందులో భాగమనీ ఎరుగడు, ఎరిగినా అహం వల్ల అసలంగీకరించడు.

ముఖ్యంగా సంస్కృతి సంప్రదాయం అనేవి అభివృద్ధికి అడ్డుఅనీ భౌతికంగా ఎన్నో సాధించదలచుకున్నవి వీనివల్ల కుదరదనీ ప్రగాఢ విశ్వాసం. ఐతే వాళ్ళు తమ సిద్ధాంతాల ప్రచారానికి కూడా ఎన్నుకునే మార్గం కళలే. రచన ఒక కళ, బోధన ఒక కళ, ఇంద్రజాలాది ప్రదర్శనలు ఒక కళ, పాట ఒక కళ. ఐనా కానీ వీళ్ళ దృష్టిలో కళ అనేది కేవలం వినోదానికే ఉండాలనీ, దానివల్ల పరంపరాగత చారిత్రక సంప్రదాయిక విషయాలు చెప్పకూడదనీ దాని వల్ల మౌఢ్యం పెరుగుతుందనిన్నీ ఒక నమ్మకం. విచారణ విశ్లేషణ చేయకుండా కళలు, ధార్మిక విషయాలు, మత సంబంధ విషయాలు ఆసాంతం పనికిరాని మూఢవిశ్వాసాలని విశ్వసించడం అతిపెద్ద మూఢవిశ్వాసం. ఆ విశ్వాసంలోనే బ్రతుకుతూ హేతువాదులు నాస్తికులు జబ్బలు చరుస్తుంటారు.

ఏ ఆస్తికుడు కానీ ధార్మికుడు కానీ ఏ నాస్తికుణ్నీ హేతువాదినీ అగౌరవ పరచడు. నిజానికి ఆస్తికులెవరూ ఒకరిపట్ల ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించరు అకారణంగా నిందకూడా చేయరు. ఇతరుల్ని అనవసరంగా అకారణంగా విషయం తెలియకుండా గేలి చేసి మాట్లాడరు. దీనికి ఫక్తు వ్యతిరేకం హేతువాదులు, అవతల వ్యక్తి ఎంత సహృదయుడైనా అతని వల్ల, అతని మాటల వల్ల ప్రజలకి, దేశానికి, ప్రపంచానికి ఎంత మంచి జరిగినా ఒప్పుకోడు. అది మంచే కాదంటాడు. భౌతికమైన, ఆర్థికమైన అభివృద్ధే మంచి గా బేరీజు వేస్తాడు తప్ప వ్యక్తిగత, కుటుంబగత, సామాజిక శాంతి సౌఖ్యాలు వాని పవిత్రతని అంగీకరించడు. దివ్యత్వాన్ని, పవిత్రతనీ అంగీకరించని వానికి దేవుడెలా అర్థం అవుతాడు? తాళం వేసి ఇంట్లో కూర్చున్నవాళ్ళని గుమ్మంలోంచి బైటకి తీసుకురావడం, అవగతం చేసుకోవడం అన్నవిషయానికి వ్యతిరేకంగా బుర్రకి తాళం వేసుకున్న వాళ్ళకి అర్థం చేయించడం కుదరని పని. కూడా ఎక్కడా ఏ డిక్షనరీలోనూ లేని అర్థాన్ని అప్పటికప్పుడు కలిపించి మరీ మంచి అంటే అది కాదు ఇదీ అనే అర్థం సృష్టిస్తాడు. అసలు ప్రజలకి మంచి అంటే అర్థం కేవలం భౌతికం, ఆర్థికం అన్న భావనలో ఉంటాడు.


ఆస్తికులు తమకున్న ఆధ్యాత్మిక భావాలవల్ల కొన్ని కట్టుబాట్లకి లొంగి ఉంటారు. ఎక్కువగా సామాజిక కట్టుబాట్లకి లొంగి తమ జీవనాధారాన్ని సాగిస్తారు. మానవుడు సంఘజీవి అన్న కనీస జీవన సూత్రాలననుసరించి సామాజిక కట్టుబాట్లననుసరిస్తాడు. నాస్తికుడు లేదా హేతువాదులు ఈ కట్టుబాట్లకి ఫక్తు వ్యతిరేకులు. ఇక్కడే, ఇదే వారి అసలు వ్యథ. అలవిమాలిన స్వాతంత్ర్యాన్ని నిగ్రహించేటటువంటి సామాజిక రీతి నియమాల్ని అంగీకరించలేక దాన్ని నిర్దేశించే, లేదా ఉపదేశించే నీతి ఏ రూపంలో ఉన్నా ఏ రూపంలో చెప్పబడినా వ్యతిరేకించడం, అసహన ప్రకటనం, తూలనాడడం జరుగుతుంది. ఆ నీతి నియమాలని ధార్మిక జీవనాన్ని ఎవరు బోధ చేసినా, ప్రచారం చేసినా, వారిని శత్రువులుగా చూసి నీచ కర్మమైన వ్యక్తిగత దాడికి, వ్యక్తిత్వ హననానికి ఒడిగడతారు. కట్టుబాట్లకి లొంగని మనిషికీ ఇతర జంతు జాలానికీ తేడా ఉండదు. కేవలం అవి మాట్లాడలేవు ఇతను మాట్లాడగలడు.

“Science without religion is Lame;
Religion without science is Blind.”
-Albert Einstein

-శంకరకింకర


Sunday, July 9, 2017

వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం

శ్రీ గురుభ్యోనమః

బ్రహ్మసూత్ర కృతే తస్మై వేదవ్యాసాయ వేధసే
జ్ఞాన శక్త్యవతారాయ నమో భగవతే హరేః!

"వ్యాసోచ్చిష్టం జగత్సర్వం" అను నానుడి సనాతన ధర్మ ప్రమాణ వాఙ్మయమెరుగువారెల్లరకునూ సుపరిచితమే. జగత్తందున్న సమస్తమూ వ్యాసభగవానునిచే చెప్పబడినదే తప్ప వ్యాసభగవానుడు చెప్పనిది ఏదీలేదను ప్రమాణమును వక్కాణించుటయే నానుడియొక్క అర్థము. ఉచ్చిష్టము అనగా ఎంగిలి చేయబడినది అని, అనిన జగత్తు ఒక తినెడు పదార్థమినియు, దానిని వ్యాసుడు యెంగిలిజేసెనను అపార్థమునుగొనరాదు. ఆత్మ యెంగిలిజేయబడదు అనిన అర్థము ఆత్మయెరుకను నోటితో చెప్పుట సాధ్యముగాదు అది అనుభవైకవేద్యమే అని చెప్పుట దాని పరమార్థము. అట్లే "వ్యాసుడు ఏది చెప్పేనో జగత్తంతయునూ అదే యున్నది" అని అనూచానంగా వచ్చుచున్న ప్రమాణ వాక్కు. అట్లనిన అది అతిశయోక్తియందురా!? జగత్తునందేమి గలదు? వ్యాసుడేమి చెప్పెను? వ్యాసుడు చెప్పినదే జగత్తునందుగలదనుటకు మూడుకాలములయందు జరిగినదంతయూ వ్యాసుడు చెప్పెనా లేక అతిశయోక్తియాసరి, దీనిని విచారించుటకు పూర్వము వ్యాసుడనయెవరు, వ్యాస పదవిచారణ యేమి యని తరచిచూచిన సత్యమవగతమవగలదు.

నిజమునకు వ్యాసుడు అని పిలువబడువారు వేర్వేరు కాలమున వేర్వేరు వ్యక్తులు గలరు. "వ్యాస" అనునది ఒక పదవి.ఆర్ష వాఙ్మయమును వ్యసనము చేయువారెవరో వారు వ్యాసులనబడుదురు. తేలిక పదములలో తెల్పిన విశేషముగ రచన కావించిన కావింపబడిన అపార విజ్ఞాన భాండాగారమును క్రమబద్ధముగ విభజనము చేసి వినియోగమునందు సందిగ్ధము లేకుండ తీర్చిదిద్దు ఋషి అధిష్టించు పదవి వ్యాస పదవి. ఇట్టి పదవినలంకరించిన విశిష్ఠవ్యక్తులెవరుందురో వారు ఆయాకాలములందు వ్యాసనామముతో తెలియనగుదురు. స్వయం భగవానుడైన విష్ణువే ఒక్కొక్క కాలమున వ్యాసపదవినధిరోహించి జనులకు వేద ప్రామాణిక జీవన సరళిని వాఙ్మయ రూపమున అందించుటకు కలావతారముగ అవతరించుచుండును. వ్యాసావతారము లోకరక్షణ, ధర్మ రక్షణకై విష్ణుభగవానుని అవతారమే అని ప్రసిద్ధి చెందిననూ, వేద ప్రచారమునూ, అద్దానినుగమించు పురాణేతిహాసస్తోత్రాది వాఙ్మయ సృష్టిచేయుటవలననూ చతుర్ముఖబ్రహ్మ అంశనూ, మానవ జన్మ పరమార్థమును సాధించెడి జ్ఞాన వైరాగ్యముల బోధించెడు గురుమూర్తి స్వరూపమును బొందుటవలన శంభుదేవుని యంశనూ కలిగియుండును. త్రిమూర్తుల సమాహార స్వరూపము అగుటవలన జ్ఞానము పంచుటకు వచ్చిన పరబ్రహ్మముయొక్క అవతారమే గురుమూర్తియగు వ్యాసభగవానుడని తెలియవలె.

వ్యాసభగవానుడు తానవతరించు ప్రతికాలమునందు, మనుష్యుల సామర్థ్యమునకు తగినవిధముగా వేదవిభజనయూ, తత్సంబంధ వాఙ్మయమునూ అందించి, ఐహిక ఆముష్మిక ప్రయోజనముల సిద్ధింపజేయు ధార్మిక జీవనమునకు వలసినటువంటి సాధనాసామగ్రినందజేయును. పరంపరావిధమున కలియుగారంభమునకు పూర్వము ద్వాపరాంత సమయమున బ్రహ్మవేత్తయగు పరాశరమహర్షినకూ, దివ్యజన్మమునొందిన మత్స్యగంధికీ కుమారునిగ జన్మమునెత్తిన బాలకుడే వ్యాసపదవినధిరోహించెను. కృష్ణవర్ణమున యమునా ద్వీపమున జన్మించినందులకు కృష్ణద్వైపాయనుడని పేరుకలిగెను. సద్యోగర్భమున జన్మించినదే తడవు యుక్తరూపమును పొంది కృష్ణాజినాంబరములను, కలశకమండలములను ధరించి తల్లి ఆజ్ఞనుగొని, తలచినంతనే మాతృసేవకు రాగలనని మాటయిచ్చి తపస్సుకు చనెను. బదరీవనమున వాసము చేయుటవలన బాదరాయణుడనియు పేర్గాంచెను.

ఈ కృష్ణద్వైపాయన వ్యాసమహర్షి జన్మమును విచారించినచో మనకు పారలౌకిక ఆధ్యాత్మిక విశేషములేగాక ఖగోళ, జ్యోతిష్య విశేషములుగూడ తెలియగలవు. జ్యోతిష్య గ్రంధమున కొన్ని ఒక్కొక్క రాశికి కొన్ని సూచనాత్మకమైన చిత్రములు చూపించబడును. విధమున కన్యారాశికి తెడ్డు చేతనుండి పడవ నడిపించుచున్నటువంటి స్త్రీ కన్యారాశికి గుర్తుగ చూపుట గలదు. మీనరాశికి గానూ రెండు మీనముల గుర్తును చూపించెడు చిహ్నము సైతము విదితమే. మీనమునందు దాశరాజునూ, మత్స్యగంధినీ జల రాశియైన మీన రాశియందు జన్మించినవారుగ సఞ్జాపూర్వకముగ చెప్పబడినదని గ్రంథముల పరిశీలనము వలన తెలియుచున్నది. అటులనే ద్వీపము వద్ద మంచుపొగ తెర సృష్టించుటచే ఏర్పడిన చీకట్లయందు ఉద్భవించిన జ్ఞాన సముద్రుడు కారుణ్యామృతవర్షుడూ ఐన వ్యాసభగవానుని జననము గ్రీష్మతాపముచే అల్లాడు మానవాళికి శుచిమాస పౌర్ణమాసినందు చంద్రదర్శనానంతరము జగత్తున తాపము తీర్చుటకై మేఘములు వర్షామృతములు కురిపించుటను సూచించును. విధమున లోకమున రాబోవు కలియుగమున జనుల తాపత్రయములు తీర్చి సంసారమునుదాటి తరించుటకై ఆషాడ శుద్ధపౌర్ణమి నాడు కృష్ణద్వైపయన వ్యాసుడావిర్భవించెను.

అటులనే వ్యాసోచ్చిష్టమన వ్యాసుడు చెప్పినదే జగత్తునందు గలదు తప్ప అన్యముగాదను వాచ్యార్థము సత్యమే యని యెరుగవలె. అటులైన ఇప్పటి సాంకేతికత, ఆధునిక శాస్త్ర సంపత్తి వ్యాస వాఙ్మయమందు కలదా అని సంశయము కలుగగలదు. నిగూఢముగ పరిశీలించిన ఇప్పటి ఆధునిక శాస్త్ర సాంకేతికతలేకాదు మరియెన్నింటికో ఆలవాలమౌ ముఖ్య మూల సిద్ధాంతములను వ్యాసుడు ప్రకటించెను. అది ప్రమాణ వాక్యమునకు నిగూఢమౌ ముఖ్యార్థమని తెలియవలె. ముఖ్య కారణమేమన, శారీరకమీమాంస లేదా ఉత్తరమీమాంస అని వేదాంత సిద్ధాంతమునకు పేరు అద్దాని సూత్రకర్త వేదవ్యాసుడే. శారీరకమీమాంస యనగా పరబ్రహ్మముయొక్క శరీరరూపమైన యీ జగత్తుయొక్క స్వరూపవిచారమునామూలాగ్రం చేయట వలన దీనికి శారీరకమీమాంసయను పేరుగలదు. ఒక విషయముయొక్క మూల సిద్ధాంతమును యెరిగి సంపూర్ణముగ ఆకళింపుజేసుకొనుట ద్వారా తత్సంబంధ సమస్త విషయ జ్ఞానము ఆకళింపుగాగలదు. బీజమునందున్న వ్యూహమును దెలియుట ద్వారా దాని విస్తారస్వరూపము అవగతముగాగలదు. వేద వేదాంత వేదాంగములందు గల జగత్సృష్టి రహస్యములను ఆకళింపుజేసుకొనుటయేగాక కాలాతీతుడై వాటిని దర్శించి, తాను దర్శించిన ఆరహస్యములను బ్రహ్మసూత్రములుగ ప్రకటించి జనులకందించెను. జగత్తుయొక్క సమస్త స్వరూప విచారమును సూత్రముల రూపమున దెల్పి వ్యాఖ్యానించినది వేదవ్యాసుడే. అనిన, వేదవ్యాసుని నోటినుండి ఈశ్వర శరీరరూపమౌ జగత్విచారణముగశారీరక మీమాంససమస్తమూ ప్రకటింపబడినది శరీరరూపమౌ జగత్తు వ్యాసుని యుచ్చిష్టమను మాట బహుధా యుక్తమనుటయందేవిధమైన సందియములేదని తెలియవలె.

అట్టి వేదవ్యాస భగవానునికి వేనోళ్ళ కీర్తించుచు ఉత్సవాదులు చేయుట ఆర్షభూమియందున్న ప్రతి ఒక్కరి కనీస కర్తవ్యము. ఆషాడ పున్నమనాడు కృష్ణపంచకమాదిగా వైదిక బ్రహ్మవిద్యా గురుపరంపరనావాహనజేసి పూజించి. వేదవిదులను, పౌరాణికులను వ్యాసరూపులుగయెరిగి పూజించుట, సత్కరించుట భగవాన్ శ్రీ వేద వ్యాసునికే సమర్పించు కైంకర్యములు.

నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విన్దాయత పత్రనేత్ర,
యేన త్వయా భారత తైలపూర్ణ: ప్రజ్వాలిలో జ్ఞానమయ: ప్రదీప:

జయ జయ శ్రీ సాత్యవతేయా జయ జయ
జయ జయ శ్రీ పారాశరాత్మజా జయ జయ
జయ జయ శ్రీ వేదవ్యాస భగవాన్ జయ జయ


సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు

-శంకరకింకర